Monday, March 14, 2016

నార్లపై రాయ్ భావాల అనూహ్య ప్రభావం

మార్చి 21, ఎమ్.ఎన్. రాయ్ పుట్టిన రోజు



తెలుగు వారిపై ఒకప్పుడు ఎమ్.ఎన్.రాయ్ భావాల ప్రభావం ముఖ్యంగా మేథావి వర్గాలలో బాగా కనిపించింది. ఆయన కొత్త పంథాలో శాస్త్రీయ దృక్పథంలో రాజకీయాలను పరిశీలించి ఆచరించబూని విఫలమయ్యాడు. 1955, జనవరి 26న ఎమ్.ఎన్.రాయ్ డెహరాడూన్ లో మరణించాడు. దేశవ్యాప్తంగా దినపత్రికలు ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. ఆనాడు ఇంకా ఆంధ్రజ్యోతి ప్రారంభం కాలేదు. ప్రముఖ దినపత్రికగా మదరాసు నుండి వెలువడుతున్న ఆంధ్ర ప్రభకు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకులుగా వుండేవారు. ఆ పత్రికలో రాయ్ మరణ వార్త కనిపించలేదు.
గుంటూరు హిందూ కాలేజీలో ఏకాదండయ్య హాలులో సంతాపసభ జరిగింది. కాలేజీ ప్రిన్సిపాల్ వల్లభజోస్యుల సుబ్బారావు అధ్యక్షత వహించగా, ప్రధాన వక్తగా ఆవుల గోపాలకృష్ణమూర్తి ప్రసంగించాడు.ఒక టొంపాయ్ చనిపోతే వటవృక్షం కూలింది, తారరాలింది ప్రధాన శీర్షికలతో ప్రచురించిన సంపాదకునికి ఎమ్.ఎన్.రాయ్ ఎవరో తెలియలేదా? ఇదేనా జర్నలిజం?” అని చాలా ఘాటుగా ఎ.జి.కె.ప్రసంగించారు. ఆ వార్త యథాతధంగా ఆనాడు గుంటూరులో ఆంధ్రప్రభ విలేఖరిగా వున్న సోమయాజులు మదరాసులో వున్న నార్లగారికి పంపించారు. అంతటితో నార్ల వెంటనే గుంటూరులో వున్న గుత్తికొండ నరహరికి కబురు చేసి వెంటనే ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యమంతా పంపించమన్నారు. నరహరి రాయ్ అనుచరుడే గాక మంచి వక్త, రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి రాష్ట్రకార్యదర్శిగా చేశారు. ఆయన తక్షణమే ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యమంతా నార్లకు పంపారు. అదంతా చదివిన నార్ల పూర్తిగా మారిపోయాడు. ఆ తరువాత ఆంధ్రజ్యోతి ప్రారంభమయింది. ఆ పత్రికలో రాయ్ ని గురించిన వ్యాసాలు వార్తలు అప్పటి నుంచి వెలువడ్డాయి.
నార్ల అటువంటి ప్రముఖపాత్రలు ఎందుకు ప్రచురించలేదు? 1938 నుండి ఎమ్.ఎన్.రాయ్ పై నార్లకు కోపం వుండేది. మదరాసులో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో కాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. అప్పుడు ఎమ్.ఎన్.రాయ్ భార్య ఎలెన్ రాయ్ పై అంతకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేశాడని స్వరాజ్య ఎడిటర్ కాసా సుబ్బారావుపై రాయ్ ఆగ్రహం వ్యక్తపరిచారు. చేతిలో ఒక పత్రిక పట్టుకుని ఇలాంటి వారిని కొట్టినా తప్పులేదన్నట్లుగా మాట్లాడారు. దాంతో విలేఖర్లు ఆయన ప్రెస్ కాన్ఫరెన్సుని భరించారు. అప్పటి నుంచి నార్ల కూడా రాయ్ వార్తలను పత్రికలో వేయలేదు. అలా ప్రారంభమైంది ఈ ఘటనకు మూలం.
ఎమ్.ఎన్. రాయ్ రచనలలో మెటీరియలిజం, పిల్లిజ్ఞాపకాలు, వివేచన-ఉద్వేగం-విప్లవం అనే పెద్ద గ్రంథం, రష్యా విప్లవం, చైనాలో పెద్ద విప్లవం, వైజ్ఞానిక తాత్విక ఫలితాలు, పార్టీలు అధికారం రాజకీయాలు మొదలైన ప్రముఖ రచనలన్నీ నార్లపై బాగా ముద్ర వేశాయి. తరువాత ప్రముఖ రాడికల్ హ్యూమనిస్టులు హైదరాబాదు వచ్చినప్పుడల్లా వారిని కలుసుకోవటం రాజకీయ శిక్షణ తరగతులలో ఉపన్యాసాలివ్వటం నార్ల చేసిన కార్యక్రమాల్లో పేర్కొనదగినవి. నార్ల రచనలలో రాయ్ భావాలు బాగా కనిపించాయి. సీత జోస్యం మొదలు నరకంలో హరిశ్చంద్ర వరకు ఆయన నాటకాలను సాహిత్య పరిషత్తు వారు ప్రచురించారు. ఇంగ్లీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా విదేశాలలో కూడా అది ప్రచురితమైనది. వి.యం. తార్కుండే, శిబ్ నారాయణ్ రే, ప్రేమనాథ్ బజాజ్, ఆవుల సాంబశివరావు, ఆలపాటి రవీంద్రనాథ్, ఆవుల గోపాలకృష్ణమూర్తిలతో సన్నిహిత పరిచయాలు పెంచుకున్నారు. కలకత్తాలోని సుశీల్ ముఖర్జీ నార్ల రచనలు కొన్నివెలువరించారు. నరకంలో హరిశ్చంద్ర నాటకాన్ని నరిసెట్టి ఇన్నయ్యకు అంకితం చేశారు. వీలైనప్పుడల్లా ఎమ్.ఎన్.రాయ్ భావాలతో కూడిన సంపాదకీయాలను సమయోచితంగా రాశారు. విదేశాలలో పర్యటన చేసినప్పుడు మానవవాద ఉద్యమాలను పరిశీలించారు. ఆ విధంగా ఆయనపై ఆవుల గోపాలకృష్ణ మూర్తి చేసిన విమర్శ జీవితంలో కొత్త మలుపులు తిప్పింది. రానురాను ఎమ్.ఎన్.రాయ్ ప్రభావం తెలుగు వారిలో బాగా తగ్గిపోయి కొద్దిమందికే పరిమితమైంది. తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ వారు రాయ్ రచనలను, ఆయన జీవితాన్ని గురించిన గ్రంథాలు, అనువాదాలు ఇంచుమించు సంపూర్ణంగా ప్రచురించారు. ఒక సంఘటనపై ఆవుల గోపాలకృష్ణ మూర్తి చేసిన వ్యాఖ్యలు నార్లలో ఇలా మార్పులు తీసుకురావటం గమనార్హం.

  • నరిసెట్టి ఇన్నయ్య

No comments: